Friday, August 8, 2014

మనసూ .... మతమూ .....

(English version of this story is here: Link)

అన్య లైంగికత(గే) కలిగిన ఓ అబ్బాయి తన బాల్యం లో పరమత సహనం గురుంచి ఎలా  నేర్చుకొన్నాడు? 

మనసూ.... మతమూ.... నేను ఈ రెంటి గురించి కలిపి మాట్లాడటం కొంచం వింత గా ఉంది కదా మీకు? అవును. వింతే. సహజంగా ఎవరూ ఈ రెండింటిని కలపరేమో. కాని నాకు మాత్రం ఈ రెండింటిని కలిపే మాట్లాడాలని ఉంది. బహుశా నా చిన్న నాటి రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు నా మనసు గురించి, మతం గురించి కలిపే నాకు పాఠాలు నేర్పటం మూలన్నేమో? బహుశా మతం/ధర్మం దృష్ట్యా సమాజం లో అధిక సంఖ్యాకుల వైపు ఉన్న నేను, మనసు/ప్రేమ దృష్ట్యా అల్ప సంఖ్యకుడిగా ఉండటం మూలాన్నేమో? 

మాది ఉత్తర తెలంగాణ లోని ఓ మారు మూల పల్ల్లె. ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఓ కుటుంబం. నాకు పదేళ్ళ వయసు లో నాకు తెలిసిన మతాలు రెండే. తెలుగు మాట్లాడే వారు హిందువులూ, ఉర్దూ మాట్లాడేవారు ముస్లింలు/తురకలు. మా ఇంట్లో ముస్లింల గురించి మాట్లాడుకోవటం చాలా తక్కువ. నేను భోజనం చేసేటప్పుడు అన్నం కింద పడేస్తే వచ్చే జన్మ లో తురకనిగా పుడతావని మా నానమ్మ తిట్టేది. ఎంత మాటో కదా? అలాగని మా నానమ్మ చెడ్డదనీ అనలేం, తన మాటలు అప్పటి పెద్ద వాళ్ల ఆలోచనా ధోరణి కి అద్దం పడతాయంతే. 

హిందువుల్లో ఎన్నో కులాలు ఉన్నాయని విన్నాను నేను. నాకు తెలిసిన దాన్ని బట్టి కులాలు మూడే రకాలు. ఒకటి, మా ఇంట్లో భోజనం చేసే వాళ్ళు. రెండు, మా ఇంట్లో భోజనం చేయకూడని వాళ్ళు. మూడు, మా ఇంట్లో ప్రవేశమే లేని వాళ్ళు. మేం స్నేహితులని ఎవరిని ఇంటికి తీసుకొచ్చే వాళ్ళం కాదు, బామ్మ ఏమంటుందో అని. ఓ రోజు అన్నయ్య కొందరు మిత్రులను తీసుకొచ్చాడు. వాళ్ళు ఉన్నంత సేపు బామ్మ ఏమి అనలెదు. కాని వాళ్ళు వెళ్ళాక కూచున్న కుర్చీలు కడిగించి, పడుకొన్న బిస్తరు ఉతికించి, పెద్ద రాద్దంతమే చేసింది. అమ్మా, నాన్న,ఆచారాల గురించి పెద్దగా ఏమి అనేవాళ్లు కాదు, అలా అని బామ్మకి అడ్డూ చెప్పరు. ఆప్పటి నుంచి మళ్ళీ ఎవర్నీ తీసుకోచ్చే సాహసం నేను అన్నయ్యా ఎప్పుడూ చెయలేదు. 

మా ఊళ్ళో ఉన్న పెద్ద బడి లో (గవర్నమెంటు స్కూల్లో) నాన్నటీచరు. మాది చుట్టు పక్కల ఊళ్ళల్లో కన్నా పెద్ద ఊరు కాబట్టి ఏడో క్లాసు దాకా ఉండేది. కాని విశేషం ఏంటంటే మా పేర్లు ఆ బళ్ళో ఉన్నా, మేం మాత్రం ఇంట్లోనే ప్రయివేటు టీచరు దగ్గర చదువుకొనేవాళ్ళం. బహుశా ఓ  కారణం, పెద్ద బళ్ళో నాన్నా మరో టీచరు తప్ప టౌన్ నుంచి రావాల్సిన మిగతా టీచర్లు సరిగ్గా రాక పాఠలు చెప్పకపోవటమయితే, మరో కారణం, అన్య కులాల, ముస్లిం పిల్లల తో కలిసి మేం చదువుకోవటం బామ్మకి ఇష్టం లేకపోవటమెమో. 

మా ఊళ్ళో పదో క్లాసు పాసు అయిన చాలా తక్కువ మంది లో నాన్న ఒకరు. నాన్నకు చదువు విలువ బాగా తెలుసు. అందుకే మమ్మల్ని పై తరగతులకు టౌన్ లో ఉన్న తెలుగు మీడియం కాతలిక్ బోర్డింగు స్కూల్లో చేర్పించాడు. ఇంగ్లీషు  మీడియం స్కూలు తన స్తోమతకు ఎక్కువ. మగ పిల్లలం కాబట్టి ఆ మాత్రం పై చదువులకు హాస్టలుకు పంపించే వాళ్ళు. అదే ఆడ పిల్లలయితే కష్టమే. మా చుట్టాలమ్మయి కాలేజి లో తక్కువ కులం అతనితో ప్రేమలో పడిందని మా బాబాయిల కూతుళ్ళను చదువు మాన్పించేసారు మా పెద్దోల్లు. కాని మా నాన్న మాత్రం చెళ్ళి ని పట్నం లో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచయినా సరే చదువుకొనే ఏర్పాటు చేసాడు.

మేం చేరిన కాతెలిక్ స్కూల్లో హిందూ అబ్బాయిలకు కొంచం ఫీజు ఉండేది. అదే క్రిష్టియన్ పిల్లలకు అంతా ఉచితం అనుకొంటా. అక్కడే నేను మైకేల్ ని మొట్ట మొదటి సారి చూసా. ఎంత చక్కని పిల్లాడో తను. తనని చూడగానే నేను వేసిన మొదటి ప్రశ్న నీకు తెలుగు వచ్చా అని. ఎలా అయితే ముస్లింలు ఉర్దూ మాట్లాడుతారో, క్రిష్టియన్లు వేరే ఏదన్న భాష మాట్లాడుతారేమో అనుకొన్నా. మైకేలేమో, లేదు, తెలుగేనని ఆశ్చర్యంగా చూసి చెఫ్ఫాడు. ఆ చూపు బలే నచ్చింది  నాకు. అలా మొదలైన మేము తొందరగానే మంచి స్నేహితులం అయ్యాం. అది మోహమో, కేవలం ఇష్టమో తెలీదు గాని పదకొండేళ్ళ ఆ వయసు లో తనంటే నాకు ఏదో తెలీని ఆకర్షణ మాత్రం కలిగింది. తను తన పేద కుటుంబం గురించి, ఎలా తను పొలాల్లో తల్లి దండ్రుల తో కలిసి పనికి వెళ్ళాల్సి వచ్చేదో చెప్పవాడు. వాళ్ళు మత మార్పిడి  చేసుకోన్నాక వాళ్ళ నాన్న ఇక్కడ ఉచిత చదువుకి పంపించాట్ట. నాకు మాత్రం ఈ ఒక్క విషయం నచ్చలేదు. ఏవో చిన్న చిన్న అవసరాల కోసం మత  మార్పిడి చేయించిన  స్వార్థి వాళ్ళ నాన్న అని అనిపించింది.

అంతలోనే దసరా సెలవులు వచ్చేసాయి. నన్నూ అన్నయ్యని ఇంటికి తీసుకెళ్ళటానికి నాన్న హాస్టల్ కి వచ్చాడు. కాని మైకేల్ వాళ్ళ నాన్న రాలేదు. ఎందుకని రాలేదని అడిగా. రావొద్దని తనే ఉత్తరం రాసడట. నాకు ఇంటికి వెళ్ళాలని లేదు, ఇంట్లో నాకు ఇడ్లీ, దోసా, కోడి గుడ్డు, ఇవేవీ దొరకవు, పైగా నాన్న తో కలిసి రోజూ పనికి వెళ్ళాలి, అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒకింత పాపం అనిపించింది. బహుశా వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకోవటం రైటేనేమో. కాని మరీ  ఇడ్లీ దోసా కోసం మహాభారతం భగవత్గీత వదిలేయటమా, అసలు కరెక్టు కాదు, వాళ్ళ నాన్న స్వార్థపరుడే అని ఫిక్స్ అయిపోయా.

నాకీ క్రిస్టియన్ స్కూలు అస్సలు నచ్చలేదు. ఇక్కడ శ్లోకాలు, మహాభారత పద్యాలు ఇవేవీ చెప్పరు. ఎంచక్కా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎన్ని పద్యాలు శ్లోకాలు, పురాణ కథలు నెర్చుకొన్నానో. ఆదే విషయం నాన్నకు చెప్పాను. ఏదన్నా హిందూ స్కూలు లో చేర్పించమని అడిగా. మా జిల్లా లో ఒకే హిందూ స్కూలు శిశుమందిర్ ఉందట, కాని అది మా ఊరి నుంచి చాలా దూరం, అక్కడ ఫీజు కూడా ఎక్కువ అన్నాడు నాన్న. ఒక్క క్షణం! అంటే ఫీజు కట్టలేక మమ్మల్ని క్రిస్టియన్ స్కూల్లో చేర్పించాడన్నమాట నాన్న. అంటే మైకేల్ వాళ్ళ నాన్న లాగా, మా నాన్న కూడా స్వార్థపరుడేనా? ఆలోచిస్తే ఎవరూ స్వార్థపరులు కారేమో? విద్య, ఆరోగ్యం కన్నా మతం గొప్పదేం కాదు కదా అనే విషయం అప్పుడు అర్థమైంది నాకు.

మెల్లిగా క్రిష్టియన్ స్కూలు వాతావరణానికి నేను అలవాటు పడ్డాను. క్లాసు లో ఫస్ట్ కాబట్టి, నేనంటే అందరు టీచర్లకు బలే ఇష్టం. ఇంకేం, నాదే రాజ్యం. హాస్టల్ లో కాతెలిక్ అబ్బాయిలు రొజూ ప్రొద్దున్నే చర్చి కి వెళ్లి ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఆ సమయం లో హిందూ అబ్బాయిలంతా చదువుకొవాలి (స్టడీ అవర్ అన్నమాట). అది మాకు నచ్చేది కాదు. ఓ రోజు, నేను స్టడీ అవరుకి డుమ్మా కొట్టి, మైకేల్ తో పాటు చర్చి కి వెళ్ళా. చర్చి అస్సలు నచ్చలేదు నాకు. అక్కడ అగర్బత్తి బదులు ఓంబత్తులు (క్యాండిల్) ఉన్నాయి. దీపాలు మాణిక్యాలు లేవు, హారతి లేదు. ఇవేవి లేకుండా పూజ ఎలా చేస్తారు? సంస్కృత శ్లోకాలు కాకుండా తెలుగు పాటలు పాడితే దేవుడు ఎలా ఒప్పుకొంటాడు? అసలు వాళ్ళ దేవుడు, మా దేవుడు ఒకరేనా? ఎవరు అసలైన దేవుడు? ఏది అసలైన పూజ? ఎన్నో ప్రశ్నలు నా మదిని వేదించటం మొదలు పెట్టాయి.

ఉండబట్టలేక ఆ రోజే వెళ్లి మా తెలుగు పండిట్ టీచరును అడిగా. ఆయన ఆరోజు నాకు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో ప్రతిద్వనిస్తున్నాయి. 'కన్నా! దేవుడొక్కడే. ఏ రీతిలో పూజించినా, ఏ భాష లో ప్రార్థించినా, అయన నీ మాట వింటాడు. నువ్వు చేయాల్సిందల్లా స్వచ్చమయిన మనస్సు తో ప్రార్థించటం, ఎవరికీ అపకారం తలపెట్టక పొవటమే". అంతే, ఆ రోజు నుంచి ఒకే దేవుడని నేను నమ్ముతున్నా. అదే నా ధర్మం. ఇప్పటికీ ఎవ్వరూ నా ఆ ధర్మాన్ని మర్చలేకపోయారు.

అలా రెండేళ్ళు గడిచిపోయాయి. నేను ఎనిమిదో తరగతిలో అడుగు పెట్టిన రొజులవి. ఓ రోజు రమేష్ అనే అబ్బాయి నా దగ్గరికి వచ్చి, నేను మాట్లాడే విదానం, నడిచే నడక గురించి అందరూ నవ్వుతారు, నా వెనుక నన్ను గేలి చేస్తున్నారు అని చెప్పాడు. నా ముహం మీద నవ్వలంటే వాళ్ళందరికీ భయమట, ఎంతైనా నేను అందరు మాస్టారులకు ఇష్టమైన స్టుడెంటు కదా. నాకు ఏమి బాద అనిపించలేదు. పైగా, తను అలా నా దగ్గరకి వచ్చి చెప్తున్నందుకు సంతోషం వేసింది. ఎందుకో రమేశ్ నచ్చాడు ఆ క్షణంలోనే.

రమేశ్ పెద్ద ఊరు నుంచి వచ్చాడు. తనకు హిందీ ఇంగ్లీషు బాగా వచ్చేది. మేమంతా లైఫ్ బాయ్ సబ్బు వాడితే, తను లక్స్  సబ్బువాడే వాడు. మేం పళ్ళ పొడి వాడితే, తను బ్రషు-పేస్టు వాడేవాడు. మొట్ట మొదటి సారి షాంపూ తన దగ్గరే చూసా నేను. మా స్కూలు ఫోను కి తనొక్కడికె ఫోన్లు వచ్చెవి.

హిందీ ఉర్దూ ఒక్కటేనేమో అనుకోని, ముస్లిం ల బాష మనకెందుకు లే అని నేను ఎప్పుడు నేర్చుకొలేదు. అందుకే అన్ని సబ్జెక్టుల్లో మంచి  మార్కులు వచ్చినా హిందీ మాత్రం నాకు కష్టమయ్యేది. ఆప్పుడు రమేష్ నాకు హిందీ నేర్పించంటం మొదలు పెట్టాడు. నేనేమో తనకు గణితం, సైన్సు నేర్చించేవాన్ని.అలా మేము ఎప్పుడూ కలిసే చదువుకోనేవాళ్ళం. గంటల తరబడి మాట్లాడుకొనే వాళ్ళం. హాస్టల్ లో నాకు తెలీకుండా ఏమేం జరుగుతున్నాయో చెప్పేవాడు. కొంచం మెత్తగా మాట్లాడే అబ్బాయిలను వార్డెను రాత్రి రూం కి పిలిపొంచుకొంటాడానీ, కొందరు సీనియర్ అబ్బాయిలు జూనియర్స్ ని రాగింగ్ పేరు తో అసభ్య చేష్టలు చేస్తారనీ, తెలిసి బాద వేసెది. అద్రుష్టవశాత్తు, నాతొ ఎవరు తప్పుగా ప్రవర్తించలేదు. బహుశా, నేను అందరు టీచర్లకు ఫెవరేటు అనేమో, బషుశా రమేశ్ నాకు తోడు ఉన్నాడనెమొ. ఎవరన్న నన్ను చిన్న మాట అన్నా, నా తరుపున వకాలతు పుచ్చుకొని వాళ్లతో కొట్లాడెవాడు రమేశ్. రోజూ సాయంత్రం నేను ఆటలు తన టీం లోనే అడేవాన్ని. తనకు హోంవర్క్ చెసిపెట్టటం, తనను పరీక్షల ముందు తయారు చేయించటం, ఇలా ఒకరి కోసం ఒకరు మేం ఎన్ని చెసుకొన్నమో. ఎప్పుడూ  శారీరక సంబంధం మాత్రం పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ వయసు లో చిన్న చిన్న ముద్దులే ఎక్కువ కదా. అందరూ మమ్మల్ని భార్యా భర్తలు అని ఏడిపించే వాళ్ళు. కాని నాకు మాత్రం వాళ్ళు అలా అనటం బలే నచ్చేది. కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు నాకు, పై తరగతి లో మా సెక్షనులు మారే సరికి మేం విడిపోవాల్సి వచ్చింది.

ఓ ఏడాది గడించింది. నా పదో క్లాసు లో సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు అనుకొంటా, ఇస్మయిలు ను కలిసా నేను. నేను బయట ఆడుకొనేటప్పుడా, లేక ఎవరి ద్వారా అన్నా కలిసానో గుర్తు లేదు. ఇస్మయిలు కూడా సెలవులులకు మా ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. తనతో ఆడుకోవటం మొదలు పెట్టా. తను వాళ్ళ స్నేహితులతో కలిసి వ్యవసాయ బావి లో ఈత నేర్పించటానికి తీసుకెళ్ళాడు. కాని నాకప్పుడు ఈత రాలేదు. ఆ తర్వాత సైకిల్ తొక్కటం నేర్పించాడు. ఇది మాత్రం బాగా వచ్చింది. నేను ఇస్మయిలు ని మా ఇంటికి తీసుకెల్దామనుకొన్నా,కాని బామ్మ ఏమన్నా అంటుందో అని తీసుకెళ్ళలేదు. అప్పట్లో మా ఊరిలో మొదటి కలర్ టీవి మా ఇంట్లోనే ఉండేది. చాలా మంది మా ఇంటికి సాయంత్రం రుతురాగాలు అనే తెలుగు సీరియల్ చూట్టానికి వచ్చేవాళ్ళు, ఇస్మయిలు తప్ప.

ఓ రోజు మా నాన్న కి బాగా జ్వరం వచ్చింది. మా ఊళ్ళో ఇద్దరే వైద్యులు ఉండే వాళ్ళు. వాళ్ళు కూడా ఏదో చదువుకొన్న వాళ్ళు  కాదు, టౌన్ లో మెడికల్ షాపు లో పని చేసిన అనుభవం తో ఊళ్ళో వైద్యం చేసేవాళ్ళు. వాళ్ళలో మా మామయ్య ఒకరు. మా లాంటి పెద్ద కులాల వాళ్ళు అంతా మా మామయ్య దగ్గరికి వచ్చేవాళ్ళు వైద్యానికి, మిగతా వాళ్ళంతా ఒక ముస్లిం డాక్టరు దగ్గరకి వెళ్ళే వాళ్ళు. మా నాన్నకి జ్వరం వచ్చినప్పుడు మా మామయ్య ఊళ్ళో లేరు. మా పెద్ద వాళ్ళంతా కంగారు పడిపోయారు. జ్వరమెమో పెరిగిపోతుంది. ఇంక  తప్పనయిన పరిస్తుతుల్లో ముస్లిం డాక్టరు ని పిలచారు. ఆయన ఇచ్చిన మందులతో నాన్నకి జ్వరం తగ్గింది, ఆ తర్వాత ఆ డాక్టరు పిల్లలు మా ఇంటికి టీవీ చూట్టాన్నికి రావటం మొదలు పెట్టారు. అప్పట్నుంచి నేను ఇస్మయిలు ని కూడా ఇంటికి తీసుకొచ్చే వాన్ని. ఒక్క టీవీ కి ఏంటి, రాత్రి మా ఇంట్లో జరిగే మహా భారత పారాయణం కి కూడా ఇస్మయిలు ను తీసుకొచ్చే వాన్ని. బామ్మ ఏమీ అనలేదు. బహుశా మతం కంటే మనుషుల బందాలు గొప్పవని అర్థమయిందో, లేక నన్ను నొప్పించటం ఎందుకులే అని ఊరుకొందో మరి. అలా త్వరగానే సెలవులు అయిపోయాయి, నేను హాస్టల్ కి వెళ్ళిపోవలసి వచ్చింది, మళ్ళీ ఎప్పుడూ ఇస్మయిలు ని కలిసే అవకాశమే రాలేదు.

బహుశా మైకేల్ ను గాని, ఇస్మయిలు ని గాని కలిసి ఉండకపోతే,అన్య మతాల గురించి నా భావనలు వేరే విదంగా ఉండేవేమో. బహుశా హాస్టలు లో నేను రమేశ్ తో ప్రేమలో పడకుండా, ఎవరి లైంగిక దౌర్జన్యానికయినా గురి అయ్యి ఉంటే, నా మనసు, నా లైంగికత గురించి నాకు హేయమయిన భావాలు ఉండేవేమో. బహుశా నా హాస్టలు స్నేహితులు నన్నూ రమేశునూ ప్రేమలో చూసి ఉండకపోతే, అన్య లైంగికత, స్వలింగ ప్రేమల గురించి వాళ్ళ భావనలు వేరేలా ఉండేవేమో.

ఏది ఏమయినా, ఎవరు ఎన్ని వాదనలు వినిపించినా, చివరికి తమతమ అనుభవాలు తమతమ నమ్మకాలను బలపరుస్తాయనటానికి నా బాల్యమే ఓ ఉదాహరణ కాబోలు.